చివరికి ఇంతకాలానికి వ్యావహారిక తెలుగుభాషకి ఒక నిర్దిష్టమైన వ్యాకరణం వెలువడింది. విచిత్రం కాని విచిత్రం ఏమిటంటే దీన్ని రాయటానికి ఒక ప్రత్యేకమైనః అనుభవం, అర్హత వున్న వ్యక్తి కావలసి రావటం.
వెల్చేరు నారాయణరావు యాభై ఏళ్లకి పైగా తెలుగు రాని, తెలుగు మాతృభాష కాని, అసలు తెలుగంటే ఏమిటో కూడా తెలియని పిల్లలకి తెలుగు బోధించే అధ్యా పకుడిగా ప్రత్యేకమైన అనుభవం వున్నవాడు. అది ఇంగ్లీష్ మాధ్య మంలో తెలుగు బోధించినవాడు. కఠినమైన ప్రశ్నలు అడగలేని చిన్నపిల్లలకి కాదు. ఆధ్యాపకులని లోతైన ప్రశ్నలతో మట్టిగరిపించగల అమెరికన్ కళాశాల విద్యార్థులకి, అందునా ప్రపంచం లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మేడిసన్‌లో, అంతే కాదు, తెలుగు సాహిత్యాన్ని విస్తృతావలోనకంతో మథించి వందలకొద్ది పరిశోధనాపత్రాల్ని, ఎన్నో కొత్త పుంతల్ని వేసే గ్రంథాల్ని ప్రచురించి (ఇండియాలోలా సొంత ఖర్చుల్లో కాదు సుమా, ప్రపంచప్రఖ్యాత ప్రదురణసంస్థల ద్వారా) తులనాత్మక ప్రపంచసాహిత్య (Comparative Literature) పరిశోధకుడిగా విశ్వ విఖ్యాతి గడించినవాడు. తన యాభై ఏళ్ల పైబడిన తెలుగు బోధనానుభవాన్ని రంగ రించి నారాయణరావు తయారు చేసిన ఏకైక వ్యావహారిక తెలుగు వ్యాకరణగ్రంధం 'తెలుగుదారి.'
'తెలుగుదారి' పూర్వోత్తరాల గురించి చర్చించే ముందు తెలుగు భాష స్వభావాన్ని గుర్తించి నారాయణరావు వెలువరించిన, విస్మయకరమైన ఒక లోచూపు గురించి చెప్పువంతీరాలి. అది తెలుగుభాష 'క్రియాపద కేంద్రక మైందన్నది. అంటే తెలుగుభాషా వాక్యాల్లో ప్రముఖస్థానం క్రియాపదా నిది. ఇందుకు ఒక ప్రబల నిదర్శనం విశేషణాల నుంచి వస్తుంది- ఆంగ్లం లాటి భాషల్లో నామవాచకానికి బలం చేకూర్చుతూ ఎన్నో విశేషణాలుంటాయి (adjectives) కాన తెలుగులో అత్యధికంగా వున్నవి క్రియావిశేషణాలు (adverbs), నామవాచక విశేషణాలు కావు.
ఆంగ్లం లాటి భాషల్లో వాక్యస్వరూపం 'నామ వాచకం' చుట్టూ తిరుగుతుంది. అంటే ఒకే క్రియా పదం ఏ నామవాదకానికైనా అలాగే వుంటే 'సహాయక క్రియావదం' (auxiliary verb) ఆ నామవాచకం తాలూకు కాలం, మనఃస్థితి, లేదా స్వరాన్ని తెలియ జేస్తుంది. ఉదాహరణకు He is walking, You are walking. I am walking అన్న వాక్యాలు చూస్తే అన్నింటిలోనూ క్రియ ఒక్కటే. సహాయక క్రియ మాత్రమే నామవాచకాన్ని సూచిస్తుంది. అనుసరిస్తుంది (is, are, am) ఇదే విషయం తెలుగులో చెప్పాలంటే 'అతను నడుస్తున్నాడు. మీరు నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను' అంటాం. ఇక్కడ క్రియాపదమే రూపాంతరం చెందుతుంది. సహాయక క్రియతో వనేలేదు. తెలుగుభాషలో క్రియకు అత్యంత ప్రాధాన్యత వున్నదని, మనం వ్యక్తీకరించదలుచుకున్న భావాలు చాలావరకు క్రియారూపాన్ని మార్చటం ద్వారా సాధిస్తామనేది నారాయణరావు గమనించి విస్తృతంగా విశ్లేషించిన అంశం. ఒకసారి ఈ కీలకాన్ని పట్టుకుంటే తెలుగు నేర్పటం, నేర్చుకోవటం చాలా తేలికవుతుందన్న ప్రతిపాదన, అదెలా సాధ్యమో సహేతుకంగా, సవిస్తరంగా, సోదాహరణంగా, సాధికారంగా వివరించటం ఈ గ్రంధం తెలుగుభాషకు చేసిన ఒక మహోపకారం. జిజ్ఞాసువులకు ఆలోచనా మృతం.
ఇంతవరకు తెలుగు విద్యావంతులు తెలుగు భాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించక పోవటం, ఆంగ్లంలాగా నామవాచకాత్మకం అని భ్రమించటం అనేక దురదృష్టకర పరిణామాలకు దారి తీసింది. ఇందుకు ఒక ప్రబల ఉదాహరణ వార్తా పత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారుచేసి భాషకు విపరీతమైన అవకారం చేశారు. ఉదాహరణకు ఆంగ్లంలో Thief caught అన్న శీర్షిక ఉందనుకోండి.
ఇదే భావాన్ని తెలుగులో చెప్పాలంటే 'దొంగ పట్టివేత అని తయారుచేశారు. 'దొంగ దొరికాడు' అనే సహజ, సరళ వాక్యాన్ని వదిలేసి, ఇప్పుడు ఎక్కడ చూసినా నామవాచకాంత శీర్షికలే! 'రహస్యం వెలికితీత', 'దుష్టశక్తుల ఏరివేత'- ఇలా కొత్తకొత్త పదజాలాన్ని సృష్టించి మరీ శీర్షికలని తయారుచేశారు వీరు. ఎందాకో అక్కర్లేదు, ఈ రోజు వచ్చిన శీర్షికలు కొన్ని గమనించండి- 'సహాయం కోసం జనం ఎదురు చూపులు', 'గంట కురిసిన వర్షానికే మునిగిన సెక్రటేరియట్', 'స్కూళ్లకు సెలవు', 'బాంబ్ పేల్చిన రఘురామ', 'బొక్కబోర్లాపడ్డ నేతలు', 'మరో 4 గంటల్లో ముంచుకొస్తున్న ముప్పు', 'ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జాం', 'పొంగుతున్న నాలాలు కొట్టుకుపోతున్న కార్లు', 'హైదరాబాద్‌లో కుండపోత వర్షం'. ఇవన్నీ కృత్రిమ శీర్షికలే, తెలుగుభాష స్వరూపాన్ని అర్ధం చేసుకోకుండా దున్నపోతు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్న సామెతగా ఒకరిని చూసి ఒకరు అర్థం వర్షం లేని నామవాచక రూపాల్ని తయారుచేసి జనం మీదికి వదుల్తున్నారు. కొందరు టీవీ యాంకర్లు ఏకంగా 'నేను సుబ్బారావు' వంటి తలాతోకా లేని వాక్యాల్ని తయారుచేసి ప్రేక్షకులు అంతకుముందు తెలిసిన తెలుగుని కూడ మర్చిపోయేలా చేస్తున్నారు. బుద్ధున్న ఎవడైనా 'నేను సుబ్బారావుని' అంటాడా లేక 'నేను సుబ్బారావు' అంటాడా? కనీసం మన పత్రికలు, టీవీలవారు ఈ పుస్తకాన్ని చదివి తెలుగు స్వరూప స్వభావాల్ని గ్రహించి భాషకు, జాతికి ఇప్పటివరకు చేసిన అపచారాన్ని, అపకారాన్ని సరిదిద్దుకుంటారని ఆశిద్దాం.
క్రియాత్మకమైన తెలుగు స్వభావాన్ని తేటతెల్లం చేయటానికి ఈ గ్రంధం నాలుగింట మూడువంతులు క్రియ గురించే కావటం విశేషం. క్రియ, అది వివిధ భావాల్ని ప్రత్యక్షీకరించటానికి ఎలా రూపాంతరం చెందుతుంది అనేది తెలుగు గురించి ఏమాత్రం కుతూహలం వున్నవారైనా ఈ గ్రంధం చదివి తెలుసుకోవాలి.
మన పిల్లలకు ఇంగ్లీష్ ఎలా నేర్పాలో మనకు బాగానే తెలుసు. ఇందులో వందేళ్లకు పైగా అనుభవం వుంది. ఇంగ్లీష్ వ్యాకరణం (గ్రామర్) ఇందులో ఓ ముఖ్యాంశం. ఆ వ్యాకరణంలో గట్టి పట్టు వున్న అధ్యాపకులు మనకు చాలామందే వున్నారు. బహుశః ఇప్పుడు బ్రిటన్ కన్నా ఇండియాలోనే ఇంగ్లీష్ వ్యాకరణంలో దిట్టలు ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్క ర్లేదు.
అదే తెలుగు విషయానికి వచ్చేసరికి మనం చాలా వెనకబడి వున్నాం. తెలుగు మాతృభాషగా వున్న పిల్లలకి వాడుక తెలుగు ఎలా నేర్పాలో మనం నేర్చు కోలేదు. పెద్దలకే తెలియని విషయం పిల్లలకి ఎలాగూ బోధించలేం కదా!
20వ శతాబ్దం తొలినాళ్లలో 'గ్రాంధిక తెలుగు', 'వ్యావహారిక తెలుగు' గురించి పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. గ్రంథాల్లో వుండే తెలుగు వాడుకలో రాయటానికి, మాట్లాడటానికి పనికిరాదని గిడుగు రామమూర్తి వంటివారు గట్టి పట్టుదలగా వాదించారు. నిరూపించారు కూడ. అయితే వాళ్ల వాదాలు గ్రాంధిక తెలుగు పనికిరాదని తేల్చటానికి తప్ప వ్యావహారిక తెలుగు స్వరూపం ఏమిటో నిర్దేశించటం మీద ధ్యాస చూపించలేదు. 'అదేమిటో అందరికీ తెలిసిందే, వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్నట్టు వ్యవహరించారు వారు. మహా అయితే కొందరు గురజాడ 'కన్యాశుల్కా'న్ని చూపించి 'దాన్లో వున్న తెలుగుని అనుసరించండి, చాలు.' అన్నారు. అక్కడే బోలెడంత గందరగోళానికి పునాదులు వేశారు.
"కన్యాశుల్కం"లో వున్నది పాత్రోచిత భాష కాని వ్యావహారిక భాష కాదు. అందులో పాత్రలు ఎవరి ప్రాంతం, కులం, ఆర్ధిక సామాజిక నేపథ్యాలని ప్రతిబింబించే భాషలో వాళ్లు మాట్లాడతారు, అంతే, ఆ భాషని అనుసరించమంటే, ఏ పాత్ర భాషని అనుసరించాలి అన్న మీమాంస వచ్చి కూర్చుంటుంది. గిరీశం మాట్లాడే భాష, రామప్పంతులు మాట్లాడే భాష ఒకటి కాదు: మధురవాణి మిగిలిన పాత్రల్లా మాట్లాడదు. పూటకూళ్లమ్మ పట్టే వేరు. ఇలా ఏ పాత్రకి ఆ పాత్రే, ఎవరి భాష వారిదే. పిల్లలకి నేర్పాలంటే వీటిలో ఏది సరైంది? నిజానికి ఏదీ కాదు
పోనీ మనకు ఇప్పటికే వున్న వ్యాకరణాల్ని పాటిద్దామా అంటే పిల్లలకి చెప్పటానికి మనకున్న ఒకే ఒక్క వ్యాకరణం చిన్నయసూరి 'బాల వ్యాకరణం.' దాన్ని ఆయన చక్కగానే రాశాడు. అయితే ఆ వ్యాకరణాన్ని వాడుతూ ఆయనే రాసిన పంచతంత్ర భాగాలు 'మిత్రలాభం', 'మిత్రభేదం' చూస్తే ఇట్టే తేలి పోతుంది అది నిత్యవ్యవహారాల్లో రాయటానికి, మాట్లాడటానికి వాడగలిగే భాష కాదని. నిజానికి దాని గమ్యం మన పద్యగ్రంధాల్లో వాడిన భాష స్వరూపాన్ని వివరించటం, వ్యావహారికభాషని కాదు. అంచేత మనం నిత్యవ్యవహారాల్లో రాసే, మాట్లాడే భాషకి బాల వ్యాకరణం ప్రమాణం కాదు, కాలేదు.
ఇలా మనం రెంటికీ చెడ్డ రేవళం అయాం. గ్రాంధికభాష అందామా, అది అందరికీ అందని చందమామ. వ్యావహారిక తెలుగు అందామా ఆది ఎలా వుండాలో తెలుసుకుందామంటే అలాటి ప్రమాణగ్రంధాలే లేకుండాపోయాయి. దీంతో ఎవరికి తోచినట్టు వారు రాయటం, సినిమాల్లో టీవీల్లో మాట్లాడటం, పిల్లలూ పెద్దలూ వాటి నుంచే ఎలా రాయాలో మాట్లాడాలో తెలుసుకోవలసి రావలసిన దుస్ధితి తెలుగుకి తెచ్చిపెట్టుకున్నాం.
ఈ గ్రంధం తాలూకు ఒక ముఖ్యవిశేషం ఇది అవసరానికి అనుగుణంగా తెలుగు, ఇంగ్లీషుల మిశ్రమంగా వుండటం. దీనివల్ల తెలుగు చదవటం, మాట్లాడటం రాని (అంటే అక్షరాలు చదవటం కాదు, తప్పుల్లేని వాక్యాల్లో తమ భావాల్ని వ్యక్తీకరించగలిగే కనీస పరిజ్ఞానం లేని) నేటితరాలకి వ్యావహారిక తెలుగుని ఇది అందుబాటులోకి తెస్తుంది.
దీని మరో ప్రధానపార్శ్వం తెలుగుభాషకీ ఆంగ్లానికి వున్న మౌలిక భేదాల్ని అత్యంత స్పష్టంగా సోదాహరణంగా వివరించటం. ఇది కూడ ఆంగ్లం తొలి భాషగా చదువుకుంటున్న కొత్త తరాల విద్యార్థులకి, వాళ్ల తల్లిదండ్రులు, గురువులకి ఎంతో ఉపకరించే అంశం. విద్యార్థులే కాకుండా జిజ్ఞాసువులైన పాత్రికేయులు, టీవీల్లో మాట్లాడే తలకాయలు (Talk ing Heads) కూడ దీన్నుంచి కొంతైనా నేర్చుకుని తెలుగుని నిరంతరంగా హత్యచేసే అలవాటుకి విశ్రాంతి ఇస్తారని ఆశించటం మరీ అత్యాశ కాదని ఆశ.
అలాగే, తెలుగు వ్యాకరణం గురించి పరిశోధన చేసే/చెయ్యదలిచే వారికి ఇది అమూల్యనిధి. నారాయణరావు దీన్లో వివరించిన విశేషాల్ని ఎన్నో పార్శ్వాల్లో విశ్లేషించి, విశదీకరించి పరిశోధనలు సాగించవచ్చు.
ఉదాహరణకు tense ("కాలం"?) అనే భావాన్ని తీసుకుందాం, ఆంగ్లంలో 12 రకాల tense లున్నాయి-భూత, వర్తమాన, భవిష్యత్లు, ఒక్కోదానిలో మళ్లీ నాలుగు తరగతులు. ఇవి ఉన్నత విద్యావంతులకే చాలా తికమక కలిగించే అంశాలు, విద్యార్థుల గురించి చెప్పాలా? వీటికితోడు 'స్వరం' అన్న భావం-యాక్టివ్, పేసివ్ అనేవి- కూడ కలిపితే ఇంక చెప్ప నక్కర్లేదు. అందుకే ఇప్పటికి చాలామంది భారతీయులు ఆంగ్లం మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఏ రకమైన tense వాడాలో తెలీక తప్పుల్లో కాళేస్తుంటారు. ఇక వీటికి శ్వరం సంక్లిష్టత కూడ తోడయిందంటే గిలగిల్లాడటమే!
నారాయణరావు గుర్తించి వివరించిన మరో లోతైన అంశం నిజానికి 'కాలం' అన్నది ఆంగ్లంలోని tense నిజమైన పర్యాయపదం కాదని, ఆంగ్ల tenseలో సార్వజనీనమైన కాలగమనం అనే ఒక అంశం, వ్యాకరణసంబంధమైన భూత వర్తమాన భవిష్యత్లనే అంశం కలగాపులగంగా కలిసిపోయి. వున్నాయని, తెలుగులో ఈ రెండు పార్శ్వాలు విడివిడిగా దేనికదే సమానస్థాయిలో ఉంటాయని. ఉదాహరణకు వర్తమానం అనేది తెలుగుభాషలో ఒక కాలం కాదు. 'సాగుతూ వుండటం' (progression) అనేది ఒక వర్గం (mode) దాన్ని ఏ కాలానికైనా అన్వ యించవచ్చు. ఉదాహరణకు 'నిఖిల్ నడుస్తున్నాడు. అంటే అది వర్తమానాన్ని, 'అప్పుడు నిఖిల్ నడుస్తున్నాడు" అంటే అది భూతకాలాన్ని, 'అప్పుడు నిఖిల్ నడుస్తూ ఉంటాడు' అనేది భవిష్యత్‌ని సూచిస్తాయి. ఇక్కడ 'నడుస్తూ' అనేది ప్రొగ్రెసివ్ మోడ్, చూశారా, ఆంగ్లంతో పోలిస్తే తెలుగు tense లు ఎంత తేలికో!
తన యాభై ఏళుళ పైబడిన తెలుగు అధ్యాపకానుభవానికి అద్భుత పరిశీలన, అకుంఠిత పరిశోధనాకుశలతని రంగరించి నారాయణరావు నిర్మించిన ఈ గ్రంధం అజరామరం. తెలుగుభాష గురించి, దాని భవిష్యత్తు గురించి కొంచెమైనా ఆలోచన వున్న ఎవరికైనా అవశ్యపఠనీయం.
ఈ గ్రంధం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాల్లోనూ దొరుకుతుంది. కొని చదవండి, చదివించండి, మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి.
కె.వి.ఎస్. రామారావు ఈ మాట వెబ్ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు దానికి సంపాదకత్వం వహించారు. ఎప్పుడన్నా కథలు, కవితలు రాస్తుంటారు. సాహిత్య విమర్శ వీరికి అభిమాన ప్రక్రియ. సినిమాల మీద సునిశితమైన సమీక్షావ్యాసాలు రాస్తుంటారు. కాలిఫోర్నియా రాష్ట్రం శాస్రోమోన్లో నివాసం, email: kyramarno gmail.com
Do you need help? Just Email or call us
© 2023 Telugu Association of North America. All rights reserved.
Design & Developed by Arjunweb