TANA - Gidugu Ramamurthy Award
తానా గిడుగు రామ్ మూర్తి స్మారక పురస్కారాలు 2002-2016
ఇంచుమించుగా 20వ శతాబ్ది ప్రారంభం నుంచి ఆధునిక భావజజాలం భారతీయ మేధావుల్ని ప్రభావితం చెయ్యటం ప్రారంభించింది. మారుతున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థల కనుగుణంగా సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి కోసం సంస్కర్తలు కొందరు ఉద్యమాలు నడిపారు. వ్యక్తులుగా కృషి చేశారు. ఆంధ్రదేశంలో రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు, కందుకూరి వీరేశ లింగం పంతులుగారు, గురజాడ అప్పారావుగారు... ఇంకా ఇంకా అనేకులు ఆయా రంగాలను ఆధునికం చేయటానికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్య భావాలను ప్రచారం చేశారు. భాషారంగంలో ప్రధానంగా ఈ పని చేసిన వారు గిడుగు రామమూర్తిగారు.
గిడుగు రామమూర్తి (1863-1940) పేరు చెప్పగానే 20వ శతాబ్ది ప్రథమ పాదంలో వ్యావహారిక భాషావాదానికి ఉద్యమరూపం కల్పించి గ్రాంధిక భాషావాదులపై విజయం సాధించిన ఒక భాషాయోధునిగా ఆయన్ని అందరూ పరిగణిస్తారు. దీనికి మించి ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పాఠ్యగ్రంథ రచయిత. సవర భాషకు వ్యాకరణం రచించి, సవరల జీవితచరిత్రను గ్రంథస్థం చేసినవాడు. సవరల అభివృద్ధికి కృషి చేసిన సంఘసేవకుడు. ప్రజాస్వామికవాది, మానవతావాది- అలా బహుముఖాలుగా ఉన్న ఆయన వ్యక్తిత్వం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
రామమూర్తిగారి ఆదర్శాన్ని, ఆచరణను గుర్తు చేసుకొని రామమూర్తి గారు మనకు వదిలిన పనులను నిర్వహించటమే మన కర్తవ్యం.
ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగా జీవితకాలం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రూ. 50,000ల నగదుతో కూడిన పురస్కారాన్ని అందజేయాలని తానా నిర్ణయించింది. తెలుగు భాషా వికాసానికి, అభ్యున్నతికి విశేషంగా కృషి సల్పిన ప్రముఖులను ఈ పురస్కారంతో గౌరవించాలని తానా ఆశయం.
ఈ పురస్కారాలు 2002 డిసెంబర్ నుంచి ప్రకటిస్తోంది.
ప్రొఫెసర్ చేకూరి రామారావు
2002లో ప్రకటించిన ఈ పురస్కారం
2003లో శాంతాక్లారా తానా సభల్లో అందజేశారు.
ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి
2004లో ప్రకటించిన ఈ పురస్కారం 2005లో
డెట్రాయిట్ తానా సభల్లో అందజేశారు.
సి. ధర్మారావు
2006లో ప్రకటించిన ఈ పురస్కారం 2007
లో వాషింగ్టన్ డి.సి. తానా సభల్లో అందజేశారు.
ఎబికె ప్రసాద్
2008లో ప్రకటించిన ఈ పురస్కారం 2009
లో చికాగో తానా సభల్లో అందజేశారు.
స.వెం. రమేశ్
2010లో ప్రకటించిన ఈ పురస్కారం 2011
జనవరిలో విజయవాడలో పురస్కారం అందజేశారు.
ప్రొ పి.ఎస్. సుబ్రహ్మణ్యం
2012లో ప్రకటించిన ఈ పురస్కారం
2012 డిసెంబర్ లో అందజేశారు.
డా. సామల రమేష్ బాబు
2016లో ప్రకటిచ్చిన ఈ పురస్కారం 2016 డిసెంబర్ 29 న ఖమ్మం
లో జరిగింది తానా చెతన్య సంవంతీ సభల్లో అందచేశారు
1947లో తెనాలిలో జన్మించిన శ్రీ సామల రమేష్ బాబు ఆయుర్వేద వైద్యంలో ఢిల్లీ నుంచి వైద్యాచార్య పట్టాను, రాజకీయ శాస్త్రంలో ఎం.ఎ. పట్టాను పొందారు. వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు. కానీ వారి కార్యరంగం తెలుగు భాషావికాసం.
తెలుగుభాష అన్ని రంగాల్లో వాడుకలోకి రావాలని, విరివిగా ఉపయోగించడం ద్వారానే తెలుగుభాష అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావించిన సామల రమేష్ బాబు అందుకోసం అనేక ఉద్యమాలు నడిపారు. ప్రభుత్వాలతో పోరాడారు. ఈ క్రమంలో ఏర్పడిన తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాతల్లో ఒకరు. మొదటి సంస్థాపక కార్యదర్శి. 2009 నుండి దాని అధ్యక్షులు. 1993 నుంచి తాను నడుపుతున్న సామాజిక, రాజకీయ పత్రిక 'నడుస్తున్న చరిత్ర'ను 2000 నుంచి 2013 చివరి వరకు భాషోద్యమ పత్రికగ్గానే నడిపారు. ఇప్పుడు అది పేరు మార్చుకుని 'అమ్మనుడి' పత్రికగా ఆయన సంపాదకత్వంలోనే నడుస్తోంది.
తెలుగుభాష కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలని మొట్టమొదటిసారిగా గొంతెత్తి ప్రభుత్వాలను కోరుతూ ఆరేళ్లపాటు ఉద్యమం నడిపారు. వారి కృషి ఫలితంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ- రెండు రాష్ట్రాల్లో తెలుగుభాషా మంత్రిత్వశాఖలు ఏర్పడ్డాయి.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే లక్షలాది తెలుగువారికి భాష నేర్పే ఉ ద్యమాన్ని 'తెలుగువాణి' ట్రస్ట్ చేపట్టింది. వందకు పైగా పల్లెల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి 'ఎల్లలు లేని తెలుగు' ప్రాజెక్ట్ పేరున తానా సహాయసహకారాలు అందిస్తోంది. ఈ ట్రస్ట్ లో ముఖ్యులు రమేష్ బాబు. తమిళనారులోని కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి అక్కడి రచయితల రచనలను ప్రోత్సహించారు. తెలుగు కేవలం సాహిత్యభాషగా ఉంటే మనజాలదని, అన్ని రంగాల్లోను నేటి అవసరాలను తీర్చే విధంగా అత్యాధునిక భాషగా ఎదగాలని, శాస్త్ర, సాంకేతిక రంగాలతో సహా అన్ని ఉ త్పత్తి రంగాలు తెలుగుభాషతో పెంపొందాలని భావించి, అందుకోసం నిరంతర ఉద్యమాలు నడుపుతున్నారు. ఏడుపదుల వయసులోనూ తెలుగుభాష కోసం అహరహం శ్రమిస్తూ, నిత్యం తెలుగుభాషను శ్వాసించే రమేష్ బాబు కృషిని తానా గౌరవిస్తోంది.
అప్పట్లో వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపిన గిడుగు రామమూర్తి పేరు మీద ఇస్తున్న ఈ పురస్కారాన్ని ఇప్పుడు తెలుగుభాష కనుమరుగవు తోందన్న ఆందోళనల మధ్య దాని పునర్ వికాసానికి, అభ్యున్నతికి కృషి చేస్తున్న శ్రీ సామల రమేష్ బాబు గారికి అందజేస్తున్నందుకు తానా కార్యవర్గం సంతోషిస్తోంది.