ఏ ఇంగ్లీషు మాటకైనా అర్థం తెలియకపోతే వెంటనే డిక్షనరీ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందినకొద్దీ ఈ పని మరీ సులువు అయ్యింది. వర్డ్ ప్రాసెసర్లోనో లేక సెర్చ్ ఇంజన్లోనో మనకు అర్థం కావలసిన మాట టైపు చెయ్యగానే ఆ మాట అర్థం, పర్యాయపదాలు, ఇతర వివరాలు వెంటనే స్క్రీన్ మీద ప్రత్యక్షమౌతాయి.
ఇంగ్లీషు డిక్షనరీలు తరచు చూసేవారికి కూడా, తెలుగు పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీ కోసం వెతికే అలవాటు తక్కువ. దీనికి ముఖ్యకారణం మనకు తెలుగు డిక్షనరీలు (ఇక్కడే కాదు, ఇండియాలోనూ) అందుబాటులో లేకపోవటమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలుగువారు ప్రముఖపాత్రలు పోషిస్తున్నా ఇంటర్నెట్లో తెలుగు మాత్రం ఉండవలసిన స్థాయికి ఇంకా చేరు కోలేదు. కొన్నాళ్ల క్రితం వరకూ తెలుగుపదానికి అర్థం కావాలంటే, ఇంటర్నెట్ తెలుగు వేదికల మీద తెలిసినవారిని సంప్రదించ వలసిందే కాని స్వయంగా వెంటనే వెతుక్కునే అవకాశం ఉండేది కాదు.
ఈ లోటు పూరించటానికి వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగ భూషణరావు అనే ఇద్దరు హైదరాబాదు యువకులు స్వచ్ఛందంగా సిద్ధ పడ్డారు. తాము నిర్వహిస్తున్న ఆంధ్రభారతి అనే తెలుగు సాహిత్య ఖజానా వెబ్సైటులో వారు తెలుగుపదాలకు అర్థం తేలిక గా వెతుక్కునే సదుపాయం కల్పించటానికి సంకల్పించారు. తెలుగుకు సంబంధించిన అన్ని నిఘంటువు లనూ ఒక్కచోటకు తీసుకొనివచ్చి ఒక్క మౌస్ క్లిక్కులో అందరికీ అందుబాటు లో ఉంచాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. జర్మనీలో ఉండే పరుచూరి శ్రీనివాస్ వీరికి సహాయపడ్డారు.
అయితే ఇది చిన్నపనేమీ కాదు, బృహత్కార్యమనే అనాలి. ముందు నిఘంటువుల తాలూకుహక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో తెలుసుకొని వారి అనుమతి పొందాలి. నిఘంటువులో ఉన్న ప్రతి మాటనూ మళ్లీ యూనికోడ్లో టైపు చేయాలి. ఆ తర్వాత జాగ్రత్త గా ఒకటికి రెండుమార్లు ప్రూపులు సరిదిద్దుకోవాలి. ఆ తరువాత ఆ పదాలను వెతుక్కునే సెర్చ్ ఇంజన్ కంప్యూటర్ ప్రోగ్రాం తయారుచేసుకోవాలి. వేగవంతమైన కంప్యూటర్ సర్వర్లను నియో గించాలి. అంతేకాక ఈ సదుపాయం వినియోగించుకోదలచిన వారందరికీ కంప్యూటర్లో తెలుగు టైపు చేసే నైపుణ్యము, సౌకర్యము ఉ ండకపోవచ్చు. అందుచేత ఆ పదాలను ఇంగ్లీషులో టైపు చేసినా, తెలుగులో టైపు చేసినా వెతకగలిగేట్లుగా కంప్యూ టరును ప్రోగ్రాము చేయాలి.
నిజానికి ఇంత పనిని తలకెత్తుకోవాల్సినది ఔత్సాహికులు కాదు. ప్రభుత్వమో, అధికార భాషాసంఘమో, విశ్వవిద్యాలయాలో, అకాడెమీలో చేయవలసిన పని. అయితేనేం, ఆంధ్ర భారతివారు తమ ఉత్సాహమే వనరుగా ఈ పనిని ప్రారంభించారు. వారికి చేయూతనివ్వటానికి తానా ప్రచురణల కమిటీ నిశ్చయించింది. తెలుగును సంరక్షించటం, వ్యాపింప చేయటం తానా ఆశయాలలో ముఖ్యమైంది. అందుచేత తానా బోర్డ్ ఆఫ్డైరెక్టర్స్ ఈ ప్రయత్నాన్ని ఆమోదించి ప్రోత్సహించింది. ఈ ప్రయత్నానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరగానే తానా సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అవసరమైన నిధులను సమకూర్చారు. ఈ దాతలందరికి, ముఖ్యంగా కొడవళ్ల హనుమంత రావుగారికి, తానా సంస్థ తరపున నా కృతజ్ఞతలు.
ఆంధ్రభారతి-తానాల సహకారం వల్ల ఈరోజు తెలుగు మాటలకు అర్థాల్ని ఇంటర్నెట్లో వెదుక్కోవడం సులభ సాధ్య మయ్యింది. ఆంధ్రభారతి సైటుకు వెళ్తే (లేకపోతే సైటులో నిఘంటు శోధన పై క్లిక్ చేస్తే) మీరు ఏ తెలుగుమాటకైనా అర్థం తెలుసుకునే వీలున్నది. మీ వీలునిబట్టి మీకు కావలసిన మాటను ఇంగ్లీషులో కాని తెలుగులో కాని టైపు చేస్తే చాలు.
తెలుగు మాటకు తెలుగు అర్థం, తెలుగు మాటకు ఇంగ్లీషులో అర్థం, ఇంగ్లీషు మాటకు తెలుగు అర్థం, ఉర్దూ మాటకు తెలుగు అర్థం ఇప్పుడు సులభంగా వెతుక్కోవచ్చు. శంకర నారాయణ, బ్రౌన్ తెలుగు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీలతో పాటు, ఉర్దూ-తెలుగు నిఘంటువు, రవ్వా శ్రీహరి నిఘంటువు, బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశం-మొత్తం ఎనిమిది డిక్షనరీలలో ఒక్కసారే అర్థాలు, పర్యాయపదాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఈ సైటులో దాదాపు 40,000 డిక్షనరీ పేజీలు టైపుచేసి అందుబాటులోకి తెచ్చారు.
ఇదే మనకు గొప్పగా అనిపిస్తూ, ఉపయోగపడుతున్నా, ఇప్పటివరకు చేసినది సంకల్పించిన ప్రయత్నంలో సగం మాత్రమే. ఇంకా కొన్ని మాండలిక వృత్తిపదకోశాలు, పర్యాయపద నిఘం టువులు, ఆరు భాగాల సూర్యరాయాంధ్ర నిఘంటువు మరో 30 నిఘంటువులు టైపు చేయటం, ప్రూపులు దిద్దడం పూర్తయ్యింది.
నిఘంటువుల సేకరణ
ఈ నిఘంటువులు సేకరించడమన్నది పెద్ద శ్రమ. వాటిలో చాలావరకు ఇపుడు ప్రచురణలో లేవు. దుకాణాల్లో దొరికితే కొనడం, లేదంటే పాత పుస్తకాల దుకాణాల్లో వెతకడం, అక్కడా దొరక్కపోతే గ్రంథాలయాల నుంచి అద్దెకు తీసుకోవడమో, నకలు తీసుకోవడమో చేసేవారు. వావిళ్ల నిఘంటువు వంటివి కొన్ని లభ్యం కావడం కష్టమైంది. ప్రస్తుతానికి దాదాపు అన్నీ సమకూరినట్టే. వీటిలో 'ఆంధ్ర వాచస్పత్యము' (కొట్ర శ్యామల కామశాస్త్రి), 'ఆంధ్రశబ్ద రత్నాకరము' (చెలమచెర్ల రంగాచార్యులు), 'తెలుగు వ్యుత్పత్తికోశం' (ఆంధ్ర విశ్వకళాపరిషత్తు) వంటి ఎన్నో విలక్షణ నిఘంటువులు ఉన్నాయి. సూర్యరాయాంధ్ర నిఘంటువు' అందులో ఒకటి.
త్వరలో ఇవన్నీ ఇంటర్నెట్కి అప్లోడ్ చేయబడతాయి. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి దాదాపు 70 వేల పేజీలతో, 80 నిఘంటువులు అందుబాటులోకి వస్తాయి.
ఈ నిఘంటువుల్లో ప్రామాణిక సాంప్రదాయ నిఘంటువు లతో పాటు, మాండలిక పదకోశాలు, వివిధ వృత్తుల పారిభాషిక పదాల, పర్యాయ పదాల నిఘంటువులు కూడా ఉన్నాయి. వీటికి తోడు, ఇంగ్లీషు, సంస్కృత, ఉర్దూ పదాలు, పురాణాల్లో వచ్చే పేర్లు, సంగీతం, ఆయుర్వేదం వంటి వివిధ శాస్త్రాల్లో వచ్చే పదాలు, సాంకేతిక పదాల అర్థాలు కూడా ఇక్కడ లభ్యమౌతాయి.
ఇంత పెద్ద పనికి పూనుకున్నది శేషతల్పశాయి, నాగభూషణ రావులు. అయితే దీనికి ఆర్థిక సహకారాన్ని అందించింది తానా.
అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేకమంది పంపిన విరాళాల ద్వారా సేకరించిన మొత్తాన్ని వారికి అందజేయటంతో పని వేగవంత మయింది. కాబట్టే ఐదు సంవత్సరాల్లోనే మూడొంతుల పని పూర్త యింది. మరొక్క సంవత్సరంలో ఆంధ్రభారతి.కామ్ వెబ్సైట్లోని డిక్షనరీ విభాగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
తెలుగు భాషావికాసానికి, భావితరాలకి తెలుగు పదాలను నిక్షిప్తం చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తానా సంతోష పడుతోంది. ఈ యజ్ఞంలో పాల్గొన్న సాహిత్యాభిమానులకు, విరాళాలు అందజేసినవారికి తానా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
Do you need help? Just Email or call us
© 2023 Telugu Association of North America. All rights reserved.
Design & Developed by Arjunweb