తెలుగు సాహిత్యరంగంలో తానా నిర్వహిస్తున్న పాత్ర ఎనలేనిది. గత నాలుగు దశాబ్దాలుగా వివిధ సాహిత్య గ్రంథాలను తానా ప్రచురిస్తోంది. ఏ ప్రచురణకర్త ప్రచురించడానికి సాహసించని విశ్వగుణాదర్శము, దిద్దుబాటలు, కథానేపథ్యం వంటి పుస్తకాలను తానా వెలుగులోకి తీసుకొచ్చింది.
వెల్చేరు నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. విమర్శకులు, సాహిత్య పరిశోధకులు. తెలుగు సాంప్రదాయ, ఆధునిక సాహిత్యం అమెరికాలో ప్రాచుర్యం పొందడానికి, తెలుగుభాష ఉనికిని చాటడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ రాసిన అనేక వ్యాసాలను తెలుగు సాహిత్యం-కొత్తకోణాలు అనే పేరుతో ఒక సంపుటాన్ని, డేవిడ్ షుల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజులతో కలిసి రాసిన వ్యాసా లను సంస్కృతి, భాష, చరిత్ర పేరుతోను తానా ఇటీవల ప్రచురించింది. వాటి పరిచయ సభ 14 ఏప్రిల్ 2024, ఆదివారం నాడు విజయవాడలో సాహితీమిత్రుల ఆధ్వర్యంలో లోతైన అవగాహనతో కూడిన ఉపన్యాసాలతో సాగింది.
సాహితీమిత్రుల పక్షాన, తానా పక్షాన కథాసాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్, వెల్చేరు నారాయణ రావు కృషి గురించి క్లుప్తంగా పరిచయం చేసి, ముఖ్య అతిథి మండలి బుద్ధప్రసాద్‌ను. వక్తలు బి. తిరుపతి రావు, చినుకు రాజగోపాల్, కె. రామచంద్రారెడ్డిలను వేదిక పైకి ఆహ్వానించారు.
92 ఏళ్ల వయసులో ఈ సభలో పాల్గొన్న వెల్చేరు నారాయణరావుగారికి మండలి బుద్ధప్రసాద్ అభినందన సత్కారం చేసారు. నారాయణరావు చిన్ననాటి స్నేహితుడు, శిష్యుడు కొమ్మన రాధాకృష్ణ తమ చిన్ననాటి అనుబంధాన్ని పంచుకున్నారు.
తెలుగు సాహిత్యం-కొత్త కోణాలు పుస్తకం పై బి. తిరుపతిరావు సోదాహరణ ఉపన్యాసం చేసారు. సుమతీ శతకం, కన్యాశుల్కం నాటకంపై నారాయణ రావు వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలుగు సాహిత్యంలో కొత్త కోణాల ఆవిష్కరణకు ఉపయుక్తం గా ఉంటాయని భావించారు.
సంస్కృతి, భాష, చరిత్ర వ్యాససంపుటి గురించి మాట్లాడిన చినుకు రాజగోపాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అన్నమయ్యపై రాసిన వ్యాసాన్ని ప్రత్యేకంగా ఉదహరించారు.
పుస్తక ప్రచురణలో సహకారం అందించిన కె. రామచంద్రారెడ్డి, నారాయణరావు చేసిన కృషి గురించి వివరించారు.
మండలి బుద్ధప్రసాద్ నారాయణరావుకి అభినందనలు తెలియజేస్తూ, వీరి సాహిత్యంపై సమగ్రమైన చర్చ జరగాలని అభిలషించారు. వీరి లోతైన పరిశీలనాదృష్టిని అందరూ అలవరచుకోవా లని, యువతరం వీరి వ్యాసాలను అధ్యయనం చేయాలని కోరారు.
తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తకాలు ప్రచురించినందుకు తానాకు కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రస్తుతం తను రాస్తున్న ఆత్మకథ కూడా త్వరలో తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు.
సాహితీమిత్రులు పక్షాన శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు కృతజ్ఞతలు తెలియజేసారు.