తానా-మంచి పుస్తకం బాలల పుస్తకాల ఆవిష్కరణ
తానా-మంచి పుస్తకం
బాలల పుస్తకాల ఆవిష్కరణ
పిల్లలలో పఠనాసక్తిని, పుస్తకాలు చదవటాన్ని, పుస్తకాల పట్ల ఇష్టతని పెంపొందించే ఉద్దేశంతోనూ పిల్లల కోసం రాసే రచయితలను ప్రోత్సహించటం కోసమూ తానా-మంచి పుస్తకం సంయుక్తంగా 2017 నుంచి పిల్లల బొమ్మలు కథలు, నవలల పోటీని ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. తానా పూర్వ అధ్యక్షులు జంపాల చౌదరి పూనికతో ఈ పోటీ నిర్వహణ నిర్విఘ్నంగా సాగుతోంది. ఈ సంవత్సరం నిర్వహించిన పోటీలలో ఐదు నవలలకు, పది పిల్లల బొమ్మల కథలకు బహుమతులు ప్రకటించి, ఆ పుస్తకాలను ప్రచురించారు.
నవంబర్ 14న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పిల్లల బొమ్మల కథలు, నవలల ఆవిష్కరణ, బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి కథాసాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్ స్వాగతం పలుకుతూ, పిల్లల బొమ్మల కథలు, నవలలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తానా-మంచి పుస్తకం సంస్థల ఆధ్వర్యంలో పిల్లలకు సంబంధించిన 15 పుస్తకాలను ఒకేసారి విడుదల చేయడం గొప్ప విషయమని, ఇందులో చిన్నపిల్లలు రాసిన పుస్తకాలు కూడా ఉన్నా యన్నారు. వీటిని తల్లిదండ్రులు తమ పిల్లలతో చదివించాలన్నారు. పోటీలో పాల్గొన్న రచయితలకు, రచనలకు బొమ్మలు వేసిన చిత్రకారులకు తానా తరపున కృతజ్ఞతలు తెలిపారు.
పుస్తకాలను ఆవిష్కరించిన రచయిత, నటుడు డా॥ యం. భూపాల్ ఉపాధ్యాయులు పిల్లల స్థాయికి తగిన కథలు, పాఠాలు చెప్పాలని సూచించారు. అప్పుడే వారు మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు.
బొమ్మల కథల పుస్తకాలను పరిచయం చేసిన టీచర్, ఎడ్యుకేటర్ వి.ఎస్. పవిత్ర మాట్లాడుతు పిల్లల పుస్తకాల్లో జానపద కళలు, పగటి వేషగాళ్లు, పిట్టల దొర తదితర బొమ్మల కథలు చాలా బాగున్నా యన్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమి బాలసాహిత్య పురస్కార గ్రహీత దాసరి వెంకటరమణ బాలల నవలలను పరిచయం చేశారు.
ఈ సభలో సాధన సంస్థ అధ్యక్షులు సిహెచ్. మురళీమోహన్ అధ్యక్షత వహించగా ఈ సభలో మంచి పుస్తకం నిర్వాహకులు సురేష్, పి. భాగలక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.