ఇది యజ్ఞ సంపూర్తివేళ.
ఒక మహాకార్యాన్ని పూర్తిచేశామన్న గొప్ప సంతృప్తితో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” తేలికపడుతున్నవేళ.
కారణజన్ములు లోకంలో కొందరే ఉంటారు. "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని సిరులవుతారు" అన్నారు వేటూరి.
అటువంటి మహాపురుషులు సాధించిన ఘనకార్యాలను పదేపదే తలచుకొని జాతి గర్విస్తుంది. వారినుంచి స్ఫూర్తి పొందుతుంది. వారికృషిని చరిత్రీకరించడంద్వారా ఒక తరం తన తరువాత తరానికి ఆస్ఫూర్తిని పంచుతుంది. ఆ మహాపురుషుల సంపద ఈ జాతిపరమౌతుంది, జాతికి వరమౌతుంది. తరగని సిరి అవుతుంది.
"సిరి" వెన్నెల సీతారామశాస్త్రి గారి అక్షయమైన అక్షర సంపదను అలా జాతిపరం చేయాలన్నది తానా ప్రపంచసాహిత్యవేదిక మహాసంకల్పం. ఈ అక్షర యజ్ఞానికి రూపకల్పన చేయాలని, ఆ బృహత్కార్యాన్ని నా భుజస్కంధాలపై మోపి, ఆ బరువు బాధ్యతలను నిర్వహించమని తానా నన్ను ఆదేశించింది. నిజానికది బరువు కాదు - పరువు. ఈ జాతిగుండె చప్పుళ్ళలోంచి వినిపించే లయబద్దమైన దరువు.
తానా నాపై ఉంచిన విశ్వాసాన్ని, వారినమ్మకాన్ని తానా ఆత్మగౌరవానికి సరితూగేలా సిరివెన్నెలసాహిత్యాన్ని సమీకరించి, అందమైన సంపుటాలుగా వెలువరించి వ్యక్తిగతంగా నేను తేలికపడుతున్నవేళ.
తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి తాము సైతం అంటూ ముందుకొచ్చి ఎంతగానో సహకరించిన సహృదయులందరినీ తలచుకుంటూ కృతజ్ఞతతో నాఎద తడిసి ముద్దవుతున్నవేళ. ఈ సాహిత్యసంపుటాలను తమ గుండెలకు హత్తుకొని అక్షరం అక్షరాన్ని తనివితీరా ఆస్వాదించిన రసజ్ఞ పాఠక సమూహం... అనకాపల్లి నుంచి అమెరికా వరకు... అరమరికలు లేని సంతోషాశీస్సులతో మా అందరినీ ఆనందజలధిలో ముంచెత్తిన శుభవేళ... ఆ రసజ్ఞతకు శిరస్సువంచి నమస్కరిస్తూ మీ ముందుకు వచ్చాను నేను....నా కృతజ్ఞతను మీముందు ఉంచాలని!
దీన్ని సినీ పరిభాషలో చెప్పాలంటే దీపంవెలిగించి, కొబ్బరికాయకొట్టి, సినిమాకు శ్రీకారంచుట్టి, తమ ప్రతిభనంతటినీ ముడుపుకట్టి, ఒక మహాప్రయత్నాన్ని ఘనంగా పూర్తి చేసి చివరిలో బూడిదగుమ్మడికాయను పగులకొట్టి ఆ సినిమాను జాతికి సమర్పించినట్టుగా అనిపిస్తోంది నాకు.
ఈ అక్షరక్రతువును ఆరంభించేవేళ తానా ప్రపంచసాహిత్యవేదిక మహాసంకల్పాన్ని గురించి లోకానికి వివరిస్తూ గతంలో నాముందుమాటలో కొన్ని విషయాలను చెప్పాను.
సిరివెన్నెల కురిపించిన సాహిత్యం మొత్తాన్ని సినిమా, సినిమాయేతర సాహిత్యంగా విభజించి - ప్రథమ ప్రయత్నంలో ఇప్పటివరకూ సినిమాలలో వచ్చిన సిరివెన్నెల మొదటి పాటనుండి, చివరి పాటవరకు అన్నింటినీ సేకరించి, పరిష్కరించి, కాలక్రమానుగుణంగా క్రోడీకరించి, మొత్తం నాల్గు గ్రంథాలుగా సిరివెన్నెల అభిమానులకు, సాహితీ పరిశోధకులకు తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ద్వారా అందజెయ్యాలనేది మా సంకల్పం. మా ఈ ఆలోచనకు సిరివెన్నెల కుటుంబసభ్యుల అంగీకారం, ముఖ్య సంపాదకునిగా భాద్యతలు తీసుకోవడానికి అంగీకరించిన ప్రియమిత్రుడు కిరణ్ ప్రభ, ఈ ప్రయత్నంలో చేయి చేయి కలిపి పనిచేసిన సిరివెన్నెల సైన్యం, అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రోత్సహించే తానాఅధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, నేను అడగంగానే ఆర్ధిక సహకారం అందించిన సన్నిహిత మిత్రుల సహాయం ఎన్నటికీ మరువలేనిది.
సిరివెన్నెలసాహిత్యం చూసి ఇదీ మన ‘తెలుగు సంపద’ అంటూ ప్రతి తెలుగువాడి ఛాతీ గర్వంతో విశాలమవుతుంది.
సిరివెన్నెలతో నాకున్న వ్యక్తిగత సంబంధం - సంఘాలకి, సాహిత్య బంధాలకి అతీతమైన ఆత్మీయానుబంధం. ‘బావ గారూ’! అంటూ ఆయన నన్ను పలకరించిన ప్రతిసారీ అది నా హృదయాన్ని సూటిగా, మృదువుగా తాకేది.
రూపంలో చెరగని చిరునవ్వు, మాటల్లో స్వచ్ఛత, భావంలో భారతీయత, ఆలోచనల్లో సమతా మమతల కలబోత, ప్రతి పాటలో ఒక అర్ధం, పరమార్ధం చూపే తెలుగువారి తరగని సిరి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అజరామరం.
ఇది... రాటపాతే వేళ... కొబ్బరికాయ కొట్టేవేళ... మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినవేళ... నా ఎదలో ప్రతిధ్వనించిన ఉద్వేగానికి, సీతారామశాస్త్రిగారి పట్ల నాఆత్మీయ అనుబంధానికి గుర్తుగా వారికి నివాళిగా నేను ఆనాడు ఆప్తవాక్యంలా సమర్పించిన అక్షరాంజలి.
ఇక ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే వేళ, యజ్ఞం పరిపూర్ణమయ్యాక, అవభృధ స్నానం చేసేవేళ... ప్రాజాపత్య పురుషుడినుంచి పురోడాశాన్ని ... అంటే యజ్ఞప్రసాదాన్ని అందుకొంటున్న వేళ.. నాఅనుభూతులను కొన్నింటిని మీతో పంచుకోవాలని ఉంది.
మిత్రులారా !
ఒక జాతికి సిరిగా మిగలడమంటే చిన్నవిషయం కాదు. అలా జాతిసంపదగా మారిన సత్పురుషులకు నీరాజనం సమర్పించేందుకై మనం శతజయంతి సభలను నిర్వహించి,మనసారా వారిని స్మరిస్తాం - ఒక మహాత్మాగాంధీ శతజయంతి వేడుకలా... "శకపురుషుడి శతజయంతి" పేరుతో ఈ ఏడాది అంతా నిత్యమూ తెనాలిలో వైభవంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి సంబరాల్లా...!
అది జాతి కర్తవ్యం. నిజమైన కృతజ్ఞతా నివేదనం.
ఇలాంటి కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన లభించడం ఈ జాతి అభిరుచికి చిహ్నం! తెనాలిలో రోజుకొకటిగా ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ చలనచిత్రాలకు, వారం వారం నిర్వహిస్తున్న సదస్సులకు, నెలకోసారి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి పురస్కార ప్రదానోత్సవ సభలకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆ "శక పురుషుడి"స్మృతికి ఇప్పటికీ ప్రజలనుంచి వ్యక్తమవుతున్న కైమోడ్పును గమనిస్తే అభిమానులకు గుండె చెమరిస్తుంది.
ఎన్టీఆర్ 302 చిత్రాలలో నటించారు. కాబట్టి రోజుకొకటిగా ఆయన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. సరే! మరి సిరివెన్నెలవంటి సాహిత్య యుగపురుషుడి విషయంలో నివాళి అంటే.... ఆయన కలంనుంచి, గళంనుంచి, ఎద లోలోపలినుంచి వెల్లువైన ప్రతి అక్షరాన్ని ఒడిసిపట్టి ఈ జాతికి సమర్పిస్తే - అది ఒక కవికి సగౌరవ నివాళి! అసలైన అక్షర అంజలి!
అందుకే సిరివెన్నెల మరణించగానే లోకం దుఃఖంలోంచి - వాల్మీకి విషయంలో శోకమే శ్లోకంగా మారినట్లు - వారిపాటలను గ్రంథరూపంలోకి తీసుకురావాలన్న సంకల్పం వెలువడింది. అభిమానుల మనోభావాలను అర్థం చేసుకొన్న తానా ఆ సినిమా పాటలన్నింటినీ సమగ్రంగా సర్వాంగ సుందరంగా మీకు అందించింది.
అయితే నా ముందుమాటలో ఆనాడు పేర్కొన్నట్లుగా సిరివెన్నెల రాసిన కథలు, కవితలు ఇంకా ఎన్నో ఉండిపోయాయి. సినీగీతాలకే పరిమితమైన వాడుకాడుగా ఆయన! కాబట్టి ఆ మిగిలిపోయిన అక్షరకుసుమాలను మొత్తం సేకరించి, ఇదిగో ఈ ఆఖరి ఐదవ సంపుటంగా మీకు అందిస్తున్నాం. విష్ణుచిత్తుడు స్వామి కైంకర్యం కోసం పూలను సేకరించినంత శ్రద్ధగా.. శబరి రాముడికి నివేదించాలనుకొంటూ పళ్ళను ఏరినంత భక్తిగా తానా ప్రపంచసాహిత్యవేదిక, సిరివెన్నెల కుటుంబసభ్యులతో కలసి ఈ సినీయేతర సాహిత్యానికి దోసిలిపట్టి వాటికి అక్షరాకృతిని కల్పించింది. తరించింది.
ఈ మహాయజ్ఞం సఫలంగావడానికి నాకు అన్నివేళలా అందుబాటులోఉంటూ సహకరించిన సిరివెన్నెల కుటుంబ సభ్యులకు, ప్రధానసంపాదకునిగా వ్యవహరించిన మిత్రులు కిరణ్ ప్రభ గారికి, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరిగారికి, తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, అందమైన ముఖచిత్రాలతో సంపుటాలకు మరింత వన్నెతెచ్చిన ప్రముఖ చిత్రకారులు పెమ్మరాజు రవికిశోర్ గారికి, చక్కని అక్షరాకృతిని కల్పించే కృషిలో పాలుపంచుకొన్న అందరికీ .... అలాగే, అందంగా ముద్రించి మనముందుఉంచిన రాఘవేంద్ర గ్రాఫిక్స్ వారికి, ముఖ్యంగా హార్దిక, ఆర్ధిక సహకారం అందించిన దాతలందరకూ శతకోటి వందనాలు.
వీరి జీవితాలు ‘సిరి’ మయం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ.. ముందు సంపుటాలకు మాదిరే దీనికీ సహృదయస్పందన సమృద్ధిగా లభిస్తుందన్న విశ్వాసంతో...
Do you need help? Just Email or call us
© 2023 Telugu Association of North America. All rights reserved.
Design & Developed by Arjunweb